పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద టీజీఎస్‌ఆర్టీసీకి మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు : రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద టీజీఎస్‌ఆర్టీసీకి మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవి అందుబాటులోకి వచ్చిన వెంటనే సర్వీసులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 3,000కు పైగా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులతో మరింత ఆధునికంగా బస్సు సేవలు మారతాయన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద నూతన సిటీ బస్ టర్మినల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో ఈ టర్మినల్ నిర్మించనున్నారు. పీర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగించేందుకే ఈ టర్మినల్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. 100 రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, స్థానిక ప్రాంత పేరుతోనే నామకరణం చేస్తామని చెప్పారు. ప్రతిరోజూ సుమారు 1,053 బస్సు ట్రిప్పుల ద్వారా లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందించనున్నారు. కొత్త టర్మినల్‌లో ప్రత్యేక బస్ పాస్ కౌంటర్, సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఉప్పల్ ప్రధాన రహదారిపై బస్సులు నిలపడం వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట, వరంగల్, నల్గొండ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు మాత్రం పాత ఉప్పల్ బస్ స్టాండ్ నుంచే కొనసాగుతాయి. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 367 కోట్ల మంది మహిళలు ప్రయాణించి రూ.12,888 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా కాలుష్యం రాకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, తొలి దశలో 250 పాత డీజిల్ బస్సులను రిట్రోఫిట్ చేస్తున్నామని వెల్లడించారు.

إرسال تعليق

أحدث أقدم
3