కోర్టులు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే విమర్శలకు, పరిశీలనకు సిద్ధంగా ఉండాలి !

న్యూఢిల్లీలో సోమవారం జరిగిన 6వ రామ్‌ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో 'జస్టిస్‌ సీన్‌ టు బీ డన్‌: ట్రాన్స్‌పరెన్సీ అండ్‌ పబ్లిక్‌ ట్రస్ట్‌ యాజ్‌ పిల్లర్స్‌ ఆఫ్‌ ది లీగల్‌ సిస్టమ్‌' అనే అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రసంగిస్తూ  న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతం కాదని అన్నారు. కోర్టుల పనితీరుపై వచ్చే నిష్పాక్షిక, నిర్మాణాత్మక విమర్శలు న్యాయవ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే కోర్టులు విమర్శలకు, పరిశీలనకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కోర్టు తీర్పును మాత్రమే కాకుండా, ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలను కూడా ప్రజలు పరిశీలించే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. తీర్పు ప్రకటించి, దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం ప్రజలకు తెలియకుండా ఉంచితే దాన్ని పూర్తి పారదర్శకతగా చెప్పలేమన్నారు. అయితే పారదర్శకత పేరుతో కోర్టు వ్యవహారాలను సోషల్‌ మీడియా ప్రభావానికి వదిలేయకూడదని సీజేఐ హెచ్చరించారు. న్యాయస్థానాలపై బాహ్య ఒత్తిళ్లు, ప్రజాభిప్రాయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. మీడియా లేదంటే సోషల్‌ మీడియా తమ సొంత అభిప్రాయాలతో వ్యవహరించే పరిస్థితుల్లో న్యాయం జరగడమే కాకుండా అది నిష్పాక్షికంగా కనిపించేలా ఉండటం కూడా ముఖ్యమని వివరించారు. కోర్టులు ప్రజల మెప్పు పొందడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించలేవని సీజేఐ అన్నారు. కేసులో ఓడిపోయిన వ్యక్తి సైతం.. తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును ఇచ్చిన ప్రక్రియ న్యాయంగా జరిగిందని నమ్మినప్పుడే న్యాయవ్యవస్థపై నిజమైన విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల ఆమోదం కంటే న్యాయ ప్రక్రియలోని నిష్పాక్షికతే కోర్టుల విశ్వసనీయతకు కీలకమన్నారు. న్యాయవేత్త టామ్‌ ఆర్‌. టైలర్‌ పరిశోధనలను ప్రస్తావిస్తూ కేసులో ఓడిపోయినా ప్రక్రియ న్యాయంగా జరిగిందని భావించే వ్యక్తులు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. గెలుపు కంటే న్యాయమైన ప్రక్రియే కోర్టులకు చట్టబద్ధత, విశ్వసనీయతను తెచ్చిపెడుతుందని అన్నారు. 'జస్టిస్‌ ఈజ్‌ డన్‌'తో పాటు 'జస్టిస్‌ సీన్‌ టు బీ డన్‌' అనే సూత్రాన్ని కూడా సీజేఐ ప్రస్తావించారు. 1924లో ఇంగ్లండ్‌లోని 'ఆర్‌ వర్సెస్‌ ససెక్స్‌ జస్టీసెస్‌' కేసును ఉదాహరణగా తీసుకున్నారు. సంబంధిత కేసుతో అనుబంధం ఉన్న సంస్థలో కోర్టు క్లర్క్‌ పనిచేస్తున్న విషయం బయటపడటంతో.. అతను న్యాయమూర్తుల నిర్ణయాన్ని ప్రభావితం చేశాడనే ఆధారాలు లేకపోయినా, పక్షపాతానికి అవకాశం కనిపించిందనే కారణంతో తీర్పును రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. న్యాయం చేయడం మాత్రమే కాదు.. అది న్యాయంగా జరిగిందని ప్రజలకు కనిపించడమూ అంతే ముఖ్యమని అన్నారు. అలెగ్జాండర్‌ హామిల్టన్‌ రాసిన 'ది ఫెడరలిస్ట్‌ నంబర్‌ 78'ను కూడా సీజేఐ ప్రస్తావించారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు ఆర్థిక, బలప్రయోగ అధికారాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థకు ప్రధానంగా తీర్పు ఇచ్చే అధికారమే ఉందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కోర్టుల తీర్పులను గౌరవించడానికి కారణం.. న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసమేనన్నారు. ఆ విశ్వాసం ఒక్కసారి సంపాదించుకుంటే సరిపోదని.. ప్రతి దశలోనూ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు అత్యంత విలువైన మూలధనమని చెప్పారు. కోర్టు భవనం అందుబాటులో ఉండటం మాత్రమే న్యాయానికి ప్రాప్యత కాదని సీజేఐ అన్నారు. సామాన్య పౌరుడు న్యాయవ్యవస్థను చేరుకోగలగాలి, అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలగాలి, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం తనకు మరో పోరాటంగా మారకూడదని చెప్పారు. ఈ సందర్భంగా ఈ-కోర్టుల ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న పలు చర్యలను ప్రస్తావించారు. సింగిల్‌ సైన్‌-ఆన్‌ పోర్టల్‌, ఎలక్ట్రానిక్‌గా సమన్ల జారీ, జైలు-కోర్టు రికార్డుల అనుసంధానం వంటి చర్యలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయని వివరించారు. ఈ-సేవా కేంద్రాల మొబైల్‌ వాహనాల ద్వారా కోర్టు సేవలు, న్యాయ సహాయాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లే ప్రయత్నాలను కూడా ప్రస్తావించారు. ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్‌ జెఠ్మలానీ. దేశంలోనే అత్యంత పేరున్న న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన.. ఎన్నో సంచలన కేసుల్లో వాదించారు. రామ్‌ జెఠ్మలానీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం చేసిన కృషిని గుర్తుచేసిన సీజేఐ.. న్యాయవ్యవస్థలో పారదర్శకతను పునాదిగా చేసుకుని, ప్రజల విశ్వాసాన్ని నిరంతరం పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయం జరగడమే కాదు.. అది జరిగినట్లు ప్రజలకు కనిపించాలన్న సూత్రం న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments