ホーム
/
Kakinada district
/
అక్రమాలపై ప్రశ్నించినందుకే బ్యాంకు సిబ్బంది, యానిమేటర్ తనపై కుట్ర పన్నారు : ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంక్ కరస్పాండెంట్
Tuesday, September 22, 2026
Andhra Pradesh Aratlakatta village Bank correspondent records selfie video before committing suicide Bank staff and an animator conspired against him for questioning irregularities Kakinada district
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ట గ్రామంలో తన చావుకు ఓ బ్యాంకు ఉద్యోగి, డీడబ్ల్యూసీఆర్ఏ యానిమేటరే కారణమంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి 32 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపూడి మండలం కైకవోలు గ్రామానికి చెందిన నూలు వీర వెంకటరామ తిరుమూర్తి సతీష్ చిన్నతనం నుంచి అరట్లకట్టలోని తన బామ్మ గారి ఇంట్లోనే ఉంటున్నాడు. అతను స్థానికంగా ఒక నెట్ సెంటర్ నిర్వహిస్తూ, మరోవైపు బ్యాంక్ కరస్పాండెంట్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ ఆదివారం ఉదయం తన భార్య స్వాతిరోజా, కుమార్తె కనకమహాలక్ష్మి సౌధలను ఇంద్రపాలెంలోని భార్య పుట్టింటి వద్ద దింపి, తిరిగి అరట్లకట్టకు వచ్చాడు. అదే రాత్రి ఆయన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ముందు సతీష్ ఒక వీడియోను రికార్డు చేశాడు. మహిళా సంఘాల రుణ వాయిదాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై తాను ప్రశ్నించినందుకే బ్యాంకు సిబ్బంది, యానిమేటర్ తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. వివిధ సంఘాల నుంచి యానిమేటర్ నెలవారీ వాయిదాలు సేకరించి తనకు వివరాలు ఇచ్చేవారని, కొందరి వివరాలు సరిగా లేకపోవడంతో తాను స్వంత వివరాలను ఉపయోగించి డబ్బులు జమ చేశానని తెలిపారు. అయితే, బ్యాంకు అధికారులు తన ఖాతాలో రూ. 1.20 లక్షల వ్యత్యాసం ఉందని చెప్పడంతో, తాను ఎంతోకష్టపడి అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించానని ఆరోపించారు. ఆ తర్వాత మరో మొత్తం చెల్లించాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారని, దీంతో తన అప్పు సుమారు రూ. 5 లక్షలకు చేరిందని, అంతేకాకుండా తన భార్య బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారని వాపోయాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కూతురి స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బతికుండగా ఎవరూ నమ్మరనే భయంతోనే ఈ నిజాలు మరణానికి ముందు చెబుతున్నానని వీడియోలో పేర్కొన్నారు. మరోవైపు సతీష్ ఆరోపణలను బ్యాంకు సిబ్బంది ఖండించారు. సతీష్ సుమారు 60 నుంచి 70 గ్రూపులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిర్వహించాడని తెలిపారు. జూన్ నెలలో నిర్వహించిన అకౌంట్ వెరిఫికేషన్‌లో రూ. 4.90 లక్షల వ్యత్యాసం (తేడా) గుర్తించినట్లు వారు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 13న ఆయనను బీసీ బాధ్యతల నుంచి తొలగించినట్లు సిబ్బంది స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ వీడియోలో ఉన్న అంశాలపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు.
No comments:
Post a Comment