ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునర్విభజన అనంతరం ఏర్పడిన కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కొనసాగుతున్న 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో నూతనంగా మొత్తం 28 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. ఈ నూతన నిర్ణయంలో భాగంగా ఇటీవల కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనివల్ల వెనుకబడిన, ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడంతో పాటు నిధుల వినియోగం పారదర్శకంగా సాగేందుకు మార్గం సుగమమైంది. జిల్లా పరిపాలన యూనిట్‌తో జడ్పీ పరిధి కూడా సరిసమానంగా మారనుండటంతో గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం కానుంది. 28 నూతన జిల్లా పరిషత్‌ల సమర్థవంతమైన నిర్వహణ కోసం అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అదనంగా 15 జడ్పీ సీఈవో , 15 డిప్యూటీ సీఈవో పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. నూతన కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది సర్దుబాటు, పరిపాలనా వికేంద్రీకరణకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. పాత పాలకవర్గాల గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే ఈ 28 నూతన జిల్లా పరిషత్‌ల వ్యవస్థ అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ మేరకు తదుపరి సార్వత్రిక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.

Post a Comment

أحدث أقدم