తెలంగాణలోని నారాయణపేట జిల్లా కొండగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయాలు అంటే కేవలం బూతులు తిట్టుకోవడమేనా అని ఆమె ప్రశ్నించారు. సమాజంలో అధర్మం పెరిగి, పాలకుల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించి ధర్మపోరాటానికి సిద్ధం కావాలని చెబుతాడని కవిత తెలిపారు. నేడు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, అందుకే తెలంగాణ రక్షణ సేన కోస్గి వేదికగా పాంచజన్యం సభతో ధర్మ యుద్ధానికి దిగుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతులకు నీళ్లిచ్చే ఆలోచనే లేదని కవిత ఆరోపించారు. నీళ్లు, యూరియా, ధాన్యం కోసం రైతన్నలు అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటికి నిన్న పాలమూరు రైతులు జూరాల హెడ్ రెగ్యూలేటర్‌ను పగులగొట్టి మరీ నీళ్లు విడుదల చేసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. వరి, మొక్కజొన్న రైతులు తమ పంటను కొనమని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో మళ్లీ ఆత్మహత్యల తెలంగాణ కావాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తామని కవిత తెలిపారు. విద్య, వైద్య రంగాధ అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు అయినా సరే వెనకాడకుండా ఖర్చు చేస్తామని హామీనిచ్చారు. పాలమూరులో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. బాధ్యత లేని నాయకులు ఉన్నప్పుడు యువత బలమైన నాయకులుగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతలేమో తాను కాంగ్రెస్ విడిచిన బాణమని, సీఎం రేవంత్ రెడ్డి ఏమో కల్వకుంట్ల కుటుంబం అవినీతి పేరుతో తాను బీఆర్ఎస్ విడిచిన బాణమని ప్రచారం చేస్తూ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. తాను ఎవరి బాణాన్ని కాదని, తెలంగాణ బహుజనుల బాణాన్ని అని స్పష్టం చేశారు. ఈ సభలో ప్రజా గాయకుడు గద్దర్ పాడిన 'భలేగుందిరో మన అసెంబ్లీ' పాటలోని చరణాలను పాడి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలంతా ఏకమై తెలంగాణ రక్షణ సేనను అక్కున చేర్చుకుని ఆశీర్వదిస్తే, రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తామని కవిత పిలుపునిచ్చారు.
నేను ఎవరి బాణాన్ని కాను - బహుజనుల బాణాన్ని: ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కల్వకుంట్ల కవిత
الأحد، 20 سبتمبر 2026
I am not anyone's arrow I am the arrow of the Bahujans Kalvakuntla Kavitha lashes out at the government's conduct telangana
ليست هناك تعليقات:
إرسال تعليق