తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆమెకు పార్టీ, ప్రభుత్వ స్థాయిలో ఏదైనా కీలక పదవిని కట్టబెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి హన్మకొండలోని తమ నివాసంలో ఇవాళ కాసేపట్లో ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడం, తమకు కీలక బాధ్యతలు దక్కనున్నట్లుగా కొండా మురళి ఇప్పటికే సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. కార్యకర్తలతో భేటీ ముగిసిన వెంటనే కొండా సురేఖ హస్తినకు పయనమై హైకమాండ్ పెద్దలను కలవనున్నారు. అయితే, మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమె ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
Post a Comment