ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా హర్దౌలీ గ్రామంలో గత కొద్ది రోజులుగా రిలయన్స్ జియో నెట్‌వర్క్ తీవ్రంగా వేధిస్తోంది. ఫోన్ మాట్లాడదామన్నా, ఇంటర్నెట్ వాడదామన్నా సిగ్నల్ దొరకక గ్రామస్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో, కంపెనీ పనిమీద ఉద్యోగి గ్రామానికి వచ్చాడు. అంతే అబ్బో సిగ్నల్ రాకపోగా, మాట్లాడటానికి మనిషే దొరికాడు అనుకున్నారో ఏమో, కోపంతో ఊగిపోయిన గ్రామస్థులు అతడిని చుట్టుముట్టారు. మాటల దాడితో ఆగకుండా, ఏకంగా అతడిని తీసుకెళ్లి దగ్గర్లోని మొబైల్ టవర్‌కు తాళ్లతో కట్టేశారు. మా ఊళ్లో నెట్‌వర్క్ సరిగ్గా వచ్చేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. పనిమీద వచ్చిన ఉద్యోగి టవర్‌కు బందీగా మారిన ఈ విచిత్ర దృశ్యాలను స్థానికులు ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది? ఆ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేయడంతో విషయం కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన హర్దౌలీ గ్రామానికి చేరుకున్నారు. కోపంతో ఉన్న గ్రామస్థులకు నచ్చజెప్పి, టవర్‌కు కట్టేసి ఉన్న ఉద్యోగిని సురక్షితంగా విడిపించారు. సమస్యలు ఉంటే అధికారులకు లేదా వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యాదు చేయాలి కానీ, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర నేరం అని క్లాస్ పీకారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
0 Comments