ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం 'సెమీకాన్ ఇండియా-2026' సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ మెగా చిప్ సమ్మిట్ జరగనుంది. 'సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఈకోసిస్టమ్' అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. 2026 జూలై తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచానికి నమ్మకం పెరుగుతోందనడానికి ఇటీవల నిర్వహించిన బ్రిక్స్ సదస్సు కూడా ఉదాహరణ అని పేర్కొన్నారు. పది రోజుల క్రితం ముంబైలో జరిగిన ఫిన్‌టెక్ సదస్సులో ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీలపై విస్తృతంగా చర్చ జరిగిందని మోడీ తెలిపారు. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. సెమీకండక్టర్ రంగంలో చిప్ డిజైన్‌కు అవసరమైన నైపుణ్యాలను భారత యువత అభివృద్ధి చేసుకుంటోందని ప్రధాని చెప్పారు. దేశ యువత భారత్ వృద్ధికి మరింతగా సహకరించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన మైక్రోచిప్‌లను తనకు బహుమతిగా అందించారని మోడీ తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీతో లాజిస్టిక్స్, తయారీ రంగాలు మరింత బలోపేతమవుతున్నాయని ప్రధాని అన్నారు. ఈ సెప్టెంబర్‌లోనే దేశంలో దాదాపు 3,000 కిలోమీటర్ల మేర డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటి ద్వారా సరుకు రవాణా వేగవంతమై తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు విశ్వకర్మ జయంతి కూడా అని విశ్వకర్మ జయంతి రోజే 'పీఎం విశ్వకర్మ' పథకం ప్రారంభం కావడం శుభపరిణామమని మోడీ అన్నారు. భారత ప్రాచీన నిర్మాణ సంప్రదాయాలను 21వ శతాబ్దపు ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post