ఒంగోలు మున్సిపాలిటీ 150 వసంతాల వేడుకలు : ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

الأربعاء، 30 سبتمبر 2026

Andhra Pradesh Former Vice President Muppavarapu Venkaiah Naidu Attends as Chief Guest Ongole Municipality 150th Anniversary Celebrations

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 'ఒంగోలు ఉత్సవం' ఘనంగా జరిగింది. స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఒంగోలుతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. 1977లో ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సమయంలో ఒంగోలు ప్రజలు తనకు అండగా నిలిచారని తెలిపారు. నాటి రాజకీయాల్లో ప్రజలే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ధనబలం, కుల, ప్రాంతీయ భేదాల కంటే వ్యక్తిత్వం, సామర్థ్యం, నడవడిక ముఖ్యమని సూచించారు. ఎమర్జెన్సీ సమయంలో 17 నెలల 25 రోజుల పాటు జైలు జీవితం గడిపిన విషయాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. లాయర్‌గా పనిచేయాలన్న తల్లి కోరిక మేరకు న్యాయ విద్య పూర్తి చేసినప్పటికీ, ప్రజా ఉద్యమాల కారణంగా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. క్రమశిక్షణతో ఇష్టపడి కష్టపడితే ప్రజా జీవితంలో ఎప్పుడూ నష్టం ఉండదని యువతకు సూచించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త జాతిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విదేశాల్లో ఒంగోలు జాతి పశువులతో కొత్త జాతులను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, మన ప్రాంతంలో వాటి పరిరక్షణపై మరింత శ్రద్ధ అవసరమన్నారు. గ్రామాలకు రహదారులు, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రకృతి పరిరక్షణ, పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. చెరువులు, కాలువలు, రహదారుల ఆక్రమణలకు దూరంగా ఉండాలని సూచించారు. 'ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది' అనే సూత్రాన్ని పాటించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే నగరాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ 150 ఏళ్ల చరిత్రతోపాటు ఒంగోలు భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నగరాభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలు, రహదారులు నిర్మించడం మాత్రమే కాదని.. తాగునీరు, పారిశుధ్యం, గృహవసతి, ఆరోగ్యం, పౌర సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే సమగ్ర అభివృద్ధి అని అన్నారు. ప్రజల భాగస్వామ్యమే నగరాభివృద్ధికి అసలైన బలమన్నారు. ఒకే రోజు సుమారు 80 వేల గృహాల నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరించే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ రికార్డులో నమోదు చేయించడం అభినందనీయమని హరిబాబు అన్నారు. ఒంగోలు జల వనరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత వైభవాన్ని గౌరవిస్తూ, వర్తమాన బాధ్యతలను నిర్వర్తిస్తూ భవిష్యత్తును సంకల్పంతో నిర్మించాలని పిలుపునిచ్చారు. 'వికసిత ఒంగోలు' ద్వారా 'వికసిత ఆంధ్రప్రదేశ్‌', తద్వారా 'వికసిత భారత్‌' నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు బాష్యం రామకృష్ణ మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడు దేశంలో వివిధ ఉన్నత పదవులు నిర్వహించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఒంగోలుకు ప్రత్యేక చరిత్ర, గుర్తింపు ఉందన్నారు. 1876 సెప్టెంబర్‌ 30న మున్సిపాలిటీగా ఏర్పడిన ఒంగోలు నేడు కార్పొరేషన్‌ స్థాయికి ఎదగడం చారిత్రక పరిణామమన్నారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ.. ఒంగోలుకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఎందరో పోరాట యోధులు, కవులు, ప్రముఖులు ఈ ప్రాంతానికి చెందినవారన్నారు. ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ఒకే రోజు భారీగా చెత్త సేకరణ చేపట్టి ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఒంగోలు 150 ఏళ్ల వేడుకలు నిర్వహించుకోవడం ప్రత్యేక సందర్భమన్నారు. ఒంగోలు వాసి కంభంపాటి హరిబాబు గవర్నర్‌ హోదాలో ఈ కార్యక్రమానికి హాజరు కావడం గర్వకారణమన్నారు. ఒంగోలు ఘనతను ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను అభినందించారు. 150 ఏళ్ల గుర్తుగా ఒకే రోజు 150 మెడికల్‌ క్యాంపులు నిర్వహించడం ప్రత్యేకమన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లోకి తన ప్రవేశానికి మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రేరణగా నిలిచారని తెలిపారు. ఒంగోలు 150 ఏళ్ల వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఒంగోలుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారని కొనియాడారు. జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ ఒంగోలు ప్రాంతానికి బీపీసీఎల్‌, ఇండోసోల్‌ వంటి భారీ పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. కొత్తపట్నం హార్బర్‌, రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌, రామాయపట్నం పోర్టు వంటి ప్రాజెక్టులు కూడా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఒంగోలు మరో మెట్రోపాలిటన్‌ నగరంగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ.. ఒంగోలు 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తరం వారికి ఒంగోలు చరిత్ర, ప్రముఖుల గురించి తెలియజేసేలా 20 మంది ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒంగోలు ఖ్యాతిని దేశ, విదేశాలకు చాటేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలో 6 వేల టిడ్కో గృహాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్‌ తేజస్వి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎం.ఏ. షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ