Tuesday, August 11, 2026

ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి విద్యార్థిని మృతి

తెలంగాణ లోని ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో బోనాల పండుగ జరుపుకోవడానికి సంతోషంగా ఇంటికి వచ్చిన ఓ ఇంజనీరింగ్ కలల పాప, ఆర్ఎంపీ వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా రమేశ్, మౌనిక దంపతుల కుమార్తె హేమశ్రీ (14) స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన హేమశ్రీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. హాస్టల్‌కు వెళ్లే సమయానికి చిన్నారికి తేలికపాటి జలుబు, దగ్గు రాగా, తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితిని గమనించిన ఆర్ఎంపీ మొదట ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. రెండవ ఇంజెక్షన్ ఇస్తుండగానే బాలిక స్పృహ తప్పి పడిపోయింది. నోటి నుంచి నురగ రావడం గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు పరీక్షించి, బాలిక అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. చిన్నపాటి జలుబుకు వచ్చి బిడ్డ ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రైవేటు ఆసుపత్రి ప్రాంగణంలో బంధువులు తీవ్ర నిరసన తెలపగా, కొణిజర్ల ఎస్సై సూరజ్ ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే తన కుమార్తె మృతి చెందిందని తండ్రి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే సదరు ఆర్ఎంపీ పరారయ్యాడని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని ఎస్సై సూరజ్ తెలిపారు.