Tuesday, August 11, 2026

ఖగోళ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష ప్రేమికులకు పండుగ : రేపు ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్న మూడు అద్భుతాలు

అంతరిక్షంలో ఒకే రోజు మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు రేపు ఆవిష్కృతం కాబోతుండటం విశేషం. ఇందులో మొదటిది ఆరు గ్రహాల సమాహారం. గురుడు, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలు అంతరిక్షంలో ఒకే రేఖపైకి వస్తున్నట్లు కనిపిస్తాయి. దీనిని "ప్లానెటరీ పరేడ్" లేదా గ్రహాల వరుసక్రమం అని పిలుస్తారు. ఈ గ్రహాలలో గురుడు, శని వంటివి స్వచ్ఛమైన ఆకాశంలో కంటికి స్పష్టంగా కనిపించే అవకాశం ఉండగా, భూమికి చాలా దూరంలో ఉండే యురేనస్, నెప్ట్యూన్‌లను చూడటానికి టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ అవసరమవుతాయి.  రెండవ ఖగోళ అద్భుతం 109P/స్విఫ్ట్-టట్లీ అనే తోకచుక్క వదిలివెళ్లిన వ్యర్థాల వల్ల ఏర్పడే ఉల్కాపాతం. ఈ సమయంలో అంతరిక్షం నుంచి పడే చిన్నచిన్న శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి, ఘర్షణ వల్ల మండిపోతూ ఆకాశంలో కాంతివంతమైన గీతల్లా మెరుస్తాయి. రేపు అమావాస్య కావడంతో వెన్నెల వెలుగుల అంతరాయం లేక, చీకటి ఆకాశంలో ఈ ఉల్కాపాతం మరింత ప్రకాశవంతంగా కంటికి విందు చేయనుంది.  మూడవ విశేషం సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసే ఈ అద్భుత ఘట్టం రేపు సంభవించనున్నప్పటికీ, ఇది భారతదేశంలో కనిపించదు. ఈ అరుదైన ఖగోళ సమాహారం ఖగోళ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష ప్రేమికులకు ఒక గొప్ప పండుగలాంటిది.