Ad Code

కాలువలోకి దూకిన ప్రేమికులు : యువతి మృతి, ప్రాణాపాయం నుండి బయటపడ్డ యువకుడు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో పెద్దలు పెళ్లికి అంగీకరించినా, ఆ యువతిని వెంటాడుతున్న ప్రాణాంతక వ్యాధి ఆ ప్రేమికుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమికులు కాల్వలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేయగా, యువతి మృతి చెందగా, యువకుడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. స్థానికులు మరియు పోలీసుల సమాచారం ప్రకారం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన సందీప్ కుమార్ (22) చదువుకుంటుండగా, భీమవరంకు చెందిన లలితాంబిక (20) ఓ ఆక్వా షాపులో పనిచేస్తోంది. లలితాంబిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో పెద్దమ్మ వద్ద పెరుగుతోంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు తమ వివాహం గురించి సందీప్ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇటీవలే సందీప్ లలితాంబికను తన ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేయగా, సందీప్ అక్క వివాహం పూర్తయిన తర్వాత వీరికి పెళ్లి చేస్తామని పెద్దలు అంగీకరించారు. పెద్దల సమ్మతి ఉన్నప్పటికీ, లలితాంబిక ప్రాణాంతకమైన తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన వీరిద్దరూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వేండ్ర గ్రామంలోని అడవికోడు లాకుల వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సందీప్‌ను సురక్షితంగా బయటకు తీశారు. అయితే కాలువ ఉధృతికి లలితాంబిక గల్లంతైంది. సందీప్‌ను చికిత్స నిమిత్తం భీమవరం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా కాలువలో లలితాంబిక మృతదేహం లభ్యమైంది. లలితాంబికకు ఉన్న ప్రాణాంతక వ్యాధి కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu