డాబర్ ఇండియాకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. '100 శాతం' అంటూ ప్రచారం చేస్తున్న పలు ఉత్పత్తుల విక్రయాలను నిలిపేయాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ జారీ చేసిన ఆదేశాలపై కోర్టు శుక్రవారం స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే ఆగస్టు 24 వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. డాబర్ సంస్థకు ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా నిషేధాజ్ఞలు జారీ చేయడం సరైన విధానం కాదని జస్టిస్ అమిత్ మహాజన్ అభిప్రాయపడ్డారు. ఈ దశలో డాబర్ వాదనల్లో ప్రాథమికంగా బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి ప్రత్యేక నోటీసులు జారీ చేసి తగిన వివరణ కోరారు. తేనె, ఆవు నెయ్యి, వంట నూనెలు, యాపిల్ సైడర్ వెనిగర్, కొబ్బరినీళ్లు వంటి ఉత్పత్తులపై ‘100 శాతం నేచురల్’, ‘100 శాతం ప్యూర్’, ‘100 శాతం ఆర్గానిక్’ అంటూ చేస్తున్న ప్రచారాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, తాము దశాబ్దాలుగా ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని, షోకాజ్ నోటీసు ఇవ్వకుండా నిషేధం విధించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని డాబర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తమ ఉత్పత్తుల లేబుళ్లు అన్ని నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.
డాబర్‌పై ఏకపక్షంగా నిషేధాజ్ఞలు జారీ చేయడం సరైన విధానం కాదు : స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు
Friday, August 7, 2026
Delhi High Court grants stay Issuing unilateral ban orders against Dabur is not the right approach national next hearing on August 24
No comments:
Post a Comment