గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాలు, పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నది మహోగ్ర రూపాన్ని దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో, దాని ప్రభావం ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీపై స్పష్టంగా కనిపిస్తోంది. బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులు దాటడంతో, జలవనరుల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జలవనరుల శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, శనివారం ఉదయం 10 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 10.01 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అక్కడ నీటిమట్టం ఇప్పటికే 56 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో, ధవళేశ్వరం వద్ద ప్రవాహం మరింత పెరగనుంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.
0 Comments