పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని 2028, మార్చి 31 వరకు పొడిగిస్తూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 11,900 కోట్ల వ్యయంతో అమలయ్యే ఈ పథకం ఈవీల కొనుగోళ్లను పెంచడంతో పాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, దేశీయ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 2025, ఏప్రిల్ 1 నుంచి 2028, మార్చి 31 వరకు కొనుగోలు ప్రోత్సాహకం కొనసాగుతుంది. ప్రతి కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యానికి రూ. 2,500 చొప్పున, ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ. 5,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ ప్రయోజనం రూ. 1.5 లక్షల వరకు ఎక్స్-ఫ్యాక్టరీ ధర ఉన్న అర్హత కలిగిన ఈ-టూ వీలర్లకే వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా గరిష్ఠంగా 45.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మద్దతు ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ. 2,767 కోట్లను కేటాయించారు. 2024-25లో ఉన్న కిలోవాట్ అవర్‌కు రూ. 5,000, గరిష్ఠంగా రూ. 10,000 ప్రోత్సాహకంతో పోలిస్తే తాజా సబ్సిడీ తక్కువే. వాహనాల ధరలు తగ్గుతున్న కొద్దీ ఈ కిలోవాట్ అవర్ ఆధారిత ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం సమీక్షించి మార్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, నిర్ణయించిన సబ్సిడీ లేదా ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15 శాతం, ఏది తక్కువైతే దానికే ప్రోత్సాహకం పరిమితం అవుతుంది. అన్ని విభాగాలకు 2028, మార్చి 31 తుది గడువు ఉండగా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ లేదా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి క్లెయిమ్‌లు సమర్పించేందుకు చివరి తేదీ 2027, డిసెంబర్ 31గా నిర్ణయించారు.
0 Comments