చైనా తూర్పు తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తోన్న 'డాల్ఫిన్' టైఫూన్ : గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలులు

సిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'డాల్ఫిన్' టైఫూన్ చైనా తూర్పు తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలులు, కుండపోత వర్షాల ధాటికి చైనా వాణిజ్య రాజధాని షాంఘై సహా పలు ప్రధాన నగరాలు తీవ్రంగా స్తంభించిపోయాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా చైనా ప్రభుత్వం ఇప్పటికే బ్లూ అలర్ట్ జారీ చేసి, అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న షాంఘైలోని హాంకియావో, పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆదివారం నాటికి ఏకంగా 1,300కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. జెజియాంగ్, షాంఘై ఓడరేవులను అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. అలాగే యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతంలో నడిచే పలు పడవలు, రైలు సర్వీసుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని తైజౌ నగరం మరియు షాంఘై పరిసర లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 3.90 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు/పునరావాస కేంద్రాలకు తరలించారు. తీరప్రాంతాల్లోని పాఠశాలలు, వ్యాపార సంస్థలు, పర్యాటక కేంద్రాలకు ముందుజాగ్రత్తగా సెలవులు ప్రకటించారు. చైనా తీరాన్ని తాకడానికి ముందే ఈ డాల్ఫిన్ తుపాను జపాన్‌లోని ఒకినావా దీవులు, తైవాన్ ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలతో తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. ఈ దశాబ్దంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన తుపానుల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో 200 నుంచి 400 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Post a Comment

0 Comments