ఆంధ్రప్రదేశ్‌లో 2026 జాబ్ క్యాలెండర్ కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను ఒకేసారి కాకుండా అభ్యర్థుల సౌలభ్యం, పరీక్షల నిర్వహణకు అనుగుణంగా నాలుగు విడతల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి దశలో 1,523 పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయింది. రెండో దశ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో మొత్తం 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీటిలో పరిపాలనా విభాగంలో అత్యంత కీలకమైన గ్రూప్-1 కేటగిరీలో 149 పోస్టులు ఉండగా, నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ విభాగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 542 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, 182 సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. మూడో దశ నోటిఫికేషన్‌ను అక్టోబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విడతలో 2,311 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, వీటిలో గ్రూప్-2 కేటగిరీ కింద 673 పోస్టులు ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకమైన డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 200 వరకు ఉన్నాయి. వీటితో పాటు వివిధ ఇంజినీరింగ్ సర్వీసులు, ఇతర సాంకేతిక, పరిపాలనా విభాగాల్లోని 1,638 పోస్టులను కూడా మూడో దశలోనే నోటిఫై చేయనున్నారు. అక్టోబర్ 15న నాలుగో దశ కింద మరో 2,995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ విడతలో సింహభాగం విద్యాశాఖకే దక్కనుంది. ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలోనే ఏకంగా 2,991 పోస్టులను భర్తీ చేయనున్నారు.
10,060 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం : తొలి దశలో 1,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق