వెనుజులాలో జంట భూకంపాల విధ్వంసంతో ఇప్పటికే కుదేలైన వెనిజులాను ఇప్పుడు భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. భూకంపం సృష్టించిన విలయం నుండి దేశం ఇంకా కోలుకోకముందే, పోర్చుగీసా రాష్ట్రంలో సంభవించిన తీవ్ర వరదలు అక్కడి మానవతా సంక్షోభాన్ని మరింత జటిలం చేశాయి. గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. ఈ అకస్మాత్తు వరదల వల్ల ఎంత మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, ఎంత మేర నష్టం వాటిల్లింది అనే పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సుమారు ఎనిమిది గంటల పాటు నాన్‌స్టాప్‌గా కురిసిన వర్షం కారణంగా చబస్క్వెన్సిటో నది, దాని సమీపంలోని వాగులు ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఈ ఉధృతికి మోన్సెనోర్ జోస్ విసెంటె డి ఉండా పురపాలక సంఘం పూర్తిగా జలమయమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు అక్కడ పరిస్థితి ఎంత భీకరంగా ఉందో కళ్ళకు కడుతున్నాయి. కొండల పైనుంచి బురద నీరు, కొట్టుకొచ్చిన చెత్తాచెదారం వీధుల గుండా ఉప్పొంగుతూ ఇళ్ళు, వాణిజ్య భవనాల్లోకి ప్రవేశిస్తున్న విజువల్స్ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఒకవైపు భూకంప మృతుల సంఖ్య పెరుగుతుండటం, మరోవైపు ఊహించని ఈ వరదలు తోడవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అంతర్జాతీయ సాయంతో పాటు స్థానిక యంత్రాంగం కూడా ఇప్పుడు అటు భూకంప బాధితులను, ఇటు వరద బాధితులను ఆదుకోవడానికి శ్రమిస్తోంది. జూన్ 24 సాయంత్రం కేవలం ఒక నిమిషం వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో వరుసగా వచ్చిన భూకంపాల ధాటికి వెనుజులా కుదేలైంది. ఈ భూ ప్రళయంలో మృతుల సంఖ్య 1,500 దాటింది. సుమారు 4 వేల మంది తీవ్రంగా గాయపడగా, మరో 50 వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంప తీవ్రతకు 774 భవనాలు కుప్పకూలగా, 189 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు కారణంగా వెనుజులాకు 6.7 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇది ఆ దేశ మొత్తం జీడీపీ (GDP) లో 6 శాతానికి సమానం కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో వెనుజులాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చింది. భారత్, మెక్సికో, అమెరికా, బ్రెజిల్, ఎల్ సాల్వడార్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, టర్కీ, యూకే సహా పలు దేశాలు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. భూకంప బాధిత దేశానికి మానవతా దృక్పథంతో తక్షణ సాయం అందించడంలో భారతదేశం ముందు వరుసలో నిలిచింది. ఇందులో భాగంగా భారత్ 'ఆపరేషన్ అమిస్టాడ్' ను ప్రారంభించింది. భారత వాయుసేనకు చెందిన రెండు భారీ C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు సహాయక సామగ్రితో వెనుజులాకు తరలివెళ్లాయి. బాధితుల కోసం 35 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రి, మందులు మరియు వైద్య పరికరాలను భారత్ పంపింది. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు భారత సైన్యానికి చెందిన ఒక ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో పాటు, అత్యాధునిక సాంకేతికత కలిగిన రెండు 'భీష్మ్ క్యూబ్స్' మొబైల్ హాస్పిటల్ యూనిట్లను భారత్ తరలించింది. 'ఈ క్లిష్ట సమయంలో వెనిజులా ప్రభుత్వం, అక్కడి ప్రజలకు అండగా నిలవడానికి భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంది' అని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. విపత్తు వేళ భారత్ అందించిన ఈ తక్షణ స్పందనపై అంతర్జాతీయంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
వెనిజులాను ముంచెత్తుతున్న భారీ వరదలు : అంతకంతకూ పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య
الاثنين، 29 يونيو 2026
Earthquake Death Toll Rises international Massive Floods Engulf Venezuela severe flooding in Portuguesa state has further complicated the humanitarian crisis
ليست هناك تعليقات:
إرسال تعليق