దేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన వరుస అగ్నిప్రమాదాలు జరగడం వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఇందులో ఉందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు రైల్వే శాఖ పేర్కొంది. రాజస్థాన్‌లోని అమర్‌పుర, కోటా, బిహార్‌లోని ససరాం, బెంగాల్‌లోని హౌరాలో నాలుగు వేర్వేరు రైళ్లలో ఇటీవల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలపై ఆర్‌పీఎఫ్ దర్యాప్తు జరపడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరుస అగ్నిప్రమాద ఘటనలపై రైల్వే శాఖ బుధవారంనాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమరపుర ఘటనలో బెడ్డింగ్ మెటేరియల్‌కు నిప్పు పెట్టారని తెలిపింది. హౌరాలో పెట్రోల్‌లో ముంచిన క్లాత్‌ను మంటల్లో తగులబడిన బోగీ బాత్‌రూమ్‌లో గుర్తించామని పేర్కొంది. కోటాలోని రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో కూడా బాత్‌రూమ్ నుంచి మంటలు మొదలయ్యాయని, ససరాంలో ఖాళీ బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మండే వస్తువును విసిరినట్టు తమ దర్యాప్తులో తేలిందని వివరించింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139కు సమాచారం ఇవ్వాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

Post a Comment

Previous Post Next Post