ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పార్సల్ కార్యాలయాల్లో నార్కోటిక్ డాగ్స్ సహాయంతో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు, పార్సిళ్లు మరియు సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల రవాణా, నిల్వలు, సరఫరా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు కొనసాగిస్తోందన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగంపై "జీరో టాలరెన్స్" విధానాన్ని అమలు చేస్తున్నామని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే, ప్రజల సహకారంతో మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
إرسال تعليق