హారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ తప్పుడు వైద్య ప్రకటనలు, అద్భుత చికిత్సల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.73 లక్షల మందులను అధికారులు స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 33 మంది అరెస్ట్‌ చేసి 27 సంస్థలను సీజ్‌ చేశారు. కాగా, పతంజలి బ్రాండ్‌తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడటం గమనార్హం. మహారాష్ట్రలో ఇటీవల ఎఫ్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తుకారం ముండే ప్రజారోగ్య పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మే 25న బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, చట్టవిరుద్ధ ఔషధ తయారీ, విక్రయాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు మే 29న మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి భారీ తనిఖీలు నిర్వహించారు. ముంబై, కొ​ంకణ్‌, పూణే, నాసిక్‌, అమరావతి, నాగపూర్‌, శంభాజీనగర్‌ ప్రాంతాల్లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్‌మెంట్స్) యాక్ట్-1954ను ఉల్లంఘిస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు. పలు సంస్థలు తమ ఆయుర్వేద, హెర్బల్ ఔషధాలను ప్రచారం చేస్తూ క్యాన్సర్, మధుమేహం, లైంగిక సమస్యలు, స్థూలకాయం, వంధ్యత్వం వంటి తీవ్రమైన వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు "100 శాతం ఫలితం", "శస్త్రచికిత్స అవసరం లేదు", "కొద్ది రోజుల్లో వ్యాధి మాయం" వంటి వాదనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, సరైన వైద్య చికిత్సకు దూరం చేసే ప్రమాదం ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్, స్థానిక టీవీ ఛానళ్లు, పత్రికలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఈ ప్రచారం సాగుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

أحدث أقدم