ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయి. 45 లక్షల మందికి క్వాంటం, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో వీటిని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒకటి, గన్నవరంలోని మేధాటవర్స్‌లో మరొక క్వాంటం టెస్ట్‌బెడ్‌లను ఆయన జాతికి అంకితం చేశారు. క్వాంటం టెక్నాలజీకి అమరావతిని లాంచ్ పాడ్‌గా మారుస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని ప్రారంభించటం సంతోషంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ఇవాళ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలీటీ, మేథాటవర్స్‌లో 1 క్యూ పేరిట మరో క్వాంటం సిస్టం ఏర్పాటు చేశారు. అమరావతిలో ప్రారంభమైన 1ఎస్ ,1 క్యూ క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్స్ క్వాంటం ఉపకరణాలను పరీక్షించడానికి, సర్టిఫై చేయడానికి కీలకంగా మారనుందని, భారతీయ పరిశోధకులకు క్వాంటం హార్డ్‌వేర్ పరీక్షించేందుకు అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రధాన కేంద్రం అవుతుందన్నారు. అమరావతిలో ఏర్పాటైన ఈ రెండూ టెస్ట్ ఫెసిలిటీలు క్వాంటం టెక్నాలజీలో దేశ సామర్ధ్యాన్ని పెంచాయని, కేవలం ఎనిమిది నెలల్లోనే క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలు వాస్తవ రూపం దాల్చాయని చంద్రబాబు తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటం కంప్యూటర్లను నిర్మించాలని తాను ఇచ్చిన సూచనల మేరకు ఇవి ఏర్పాటయ్యాయన్నారు. దేశానికి, ప్రపంచానికి కావాల్సిన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడే తయారు చేసేలా కార్యాచరణ చేపట్టామన్నారు. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, పూణెలోని డీఆర్డీఓ సహా వివిధ సంస్థల భాగస్వామ్యంతో స్వదేశీ టెక్నాలజీతోనే ఈ క్వాంటం టెస్ట్ బెడ్‌లు సిద్ధమయ్యాయన్నారు. ఇక వ్యూహాత్మక టెక్నాలజీల్లో భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా నిర్మితమైన తొలి క్వాంటం టెస్ట్ బెడ్స్ తో ఏపీ ఈ టెస్ట్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా మారింది. ఈ రెండు క్వాంటం టెస్ట్ ఫెసిలిటీల ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించి సర్టిఫై చేసేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యాన్ని అమరావతి క్వాంటం వ్యాలీ అందిపుచ్చుకుంది. మైనస్ 273 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య క్వాంటం హార్డ్ వేర్, సెమీ కండక్టర్లను పరీక్షించేలా ఈ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు.
0 Comments