ఈనెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ మూడు రోజుల సెషన్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి దేశ భవిష్యత్తును మార్చే కీలక బిల్లులపై ప్రభుత్వం చర్చించనుంది. ఈ సమావేశాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఎంపీలకు ‘విప్’ జారీ చేశాయి. మూడు రోజుల పాటు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించాయి. ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 11 గంటలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగియడంతో ఈ పదవి ఖాళీ అయింది. అయితే, హరివంశ్ తిరిగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు, ఏప్రిల్ 10న ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రస్తుతానికి డిప్యూటీ ఛైర్మన్ రేసులో మళ్ళీ హరివంశ్ పేరే బలంగా వినిపిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించడంలో అధికార పార్టీ చూపుతున్న ఆతృతపై కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 2019 నుంచి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ దానిపై స్పందించని ప్రభుత్వం, రాజ్యసభ పదవిని మాత్రం వెంటనే భర్తీ చేయాలని చూడటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఈ నియామకాన్ని బలవంతంగా చేయాలని చూస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ఏడేళ్లుగా లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ను నియమించని ప్రభుత్వం.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ నియామకాన్ని పూర్తి చేయాలని చూడటం విడ్డూరమని జైరామ్ రమేష్ ఎద్దేవా చేశారు. ఇది రాజ్యాంగ విలువల ఉల్లంఘన అని, సంప్రదాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ఏప్రిల్ 17న జరిగే ఎన్నిక కేవలం అభ్యర్థి ఎంపిక కోసమే కాకుండా, అధికార-ప్రతిపక్షాల మధ్య బల ప్రదర్శనకు వేదికగా మారే అవకాశం ఉంది.
0 Comments