ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, ఉద్యాన వనాలకు సైతం భారీ నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి అందిన ప్రాథమిక నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి, గాలివానల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్కడా రాజకీయాలకు తావులేకుండా పారదర్శకమైన అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమర్పించిన ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 16 మండలాల పరిధిలో గల 89 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలు నీట మునిగా, పలు చోట్ల గాలివానల ధాటికి నేలవాలాయి. దీనివల్ల సుమారు 2,043 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ పంటలతో పాటు వాణిజ్యపరంగా కీలకమైన ఉద్యాన పంటలైన అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తోటలు సైతం వడగళ్ల వానకు దెబ్బతిన్నాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని 267 హెక్టార్లలో ఈ నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేవలం ప్రాథమిక అంచనాలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలో ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తిస్థాయి నష్టాన్ని లెక్కించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేస్తూ, వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో పంట నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
అకాల వర్షాలకు దెబ్బతిన్న సాధారణ పంటలు, ఉద్యాన వనాలు : నష్టపోయిన రైతును ఆదుకోవాలని ప్రభుత్వ నిర్ణయం
الخميس، 19 مارس 2026
Andhra Pradesh Chandrababu held an emergency review meeting General Crops and Horticultural Plantations Damaged by Unseasonal Rains Government Decides to Support Affected Farmers
ليست هناك تعليقات:
إرسال تعليق