కోడ్ రాయడంలో ఏఐ మోడళ్లు వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో జోహు కో ఫౌండర్ శ్రీధర్‌ వెంబు కోడింగ్ రాసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఏఐ సహాయంతో భగవద్గీత యాప్‌ను అభివృద్ధి చేసిన విషయంపై 'ఎక్స్‌' (ట్విట్టర్)లో వచ్చిన ఒక పోస్ట్‌కు స్పందించిన వెంబు, "కోడ్ రాయడంపై ఆధారపడి బతుకుతున్నవారు ప్రత్యామ్నాయ జీవనోపాధుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది" అని అన్నారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్న ఆయన, ఇది భయాందోళనలతో కాకుండా ప్రశాంతంగా అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు. "ఆ పోస్ట్‌లో చెప్పింది కేవలం భగవద్గీత యాప్ మాత్రమే కాదు. ఆంథ్రోరోపిక్ సంస్థ వారి క్లాడ్ ఏఐతో మొత్తం సీ కంపైలర్‌ను నిర్మించింది. ఇదేదో చిన్న ఇంజినీరింగ్ ఫీట్ కాదు" అని వెంబు రాసుకొచ్చారు. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను ఎలా రూపుదిద్దుతుందన్న విషయంపై గూగుల్ జెమినీ చాట్‌బాట్‌తో తాను లోతైన చర్చ నిర్వహించానని వెంబు వెల్లడించారు. ఆ సంభాషణలో కార్మికుల అవసరం తగ్గిన తర్వాతి ఆర్థిక వ్యవస్థలో సమాజం ఎలా అభివృద్ధి చెందగలదో చర్చించడమే కాకుండా, ఏఐ తన సొంత సమాధానాలను కూడా విమర్శించవచ్చంటూ సవాలు చేసినట్లు చెప్పారు. ఈ సంభాషణల ఆధారంగా, భవిష్యత్తు రెండు విధాలుగా ఉండవచ్చని వెంబు అభిప్రాయపడ్డారు. ఏఐపై యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుందన్నదే కీలకమని పేర్కొంటూ టెక్నాలజీ మానవ జీవితంలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి, మనుషులకు కుటుంబం, ప్రకృతి, కళ, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఇస్తుందని ఆశావాద దృక్కోణంలో చెప్పుకొచ్చారు. ఇక నిరాశావాద దృక్కోణంలో ఈ టెక్నాలజీ 'కేంద్రీకృత నియంత్రణ'కు దారి తీస్తుందని హెచ్చరించారు. శ్రీధర్‌ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వెంబు అంచనాలతో ఏకీభవించగా, మరికొందరు విభేదిస్తూ ఏఐ కోడింగ్ మానవ మేధస్సుకు ముగింపు కాదని వాదించారు.

Post a Comment

Previous Post Next Post