తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‍లో నిన్న జరిగిన అగ్నిప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సమాచారం అందించారనీ, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు వాడారనీ, మంటల్ని త్వరగా అదుపు చేసేందుకు చేయాల్సిన ఇతర చర్యలు అన్నీ తీసుకున్నారని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 1:40 లోపు మంటల్ని అదుపు చేశారని శిఖా గోయల్ తెలిపారు. కీలకమైన మెటీరియల్ మొత్తం సేఫ్‌గా ఉందని, గరిష్ఠ స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఏ కేసులకు సంబంధించిన మెటీరియల్ డ్యామేజ్ అయిందో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందనీ, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోందనీ, ప్రమాద సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని డైరెక్టర్ తెలిపారు. అయితే సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ఆ ఆరోపణలు నిజం కాదని ఆమె ఖండించారు. ఆధారాలు లేని అసత్య సమాచారాన్ని ప్రజలు, మీడియా వ్యాప్తి చేయవద్దని ఆమె కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ వంటి కొన్ని భాగాలకు నష్టం జరిగినప్పటికీ, ముఖ్యమైన ఫోరెన్సిక్ ఆధారాలు సురక్షితంగానే ఉన్నాయని డైరెక్టర్ శిఖా గోయల్ ధృవీకరించారు. ఈ ఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే కొన్ని కేసుల ఆధారాల్ని మాయం చేసేందుకే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

Post a Comment

Previous Post Next Post