బంగ్లాదేశ్ అవామీ లీగ్ మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ కన్నుమూశారు. దినాజ్‌పూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు ఆయనను దినాజ్‌పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రమేష్ చంద్ర సేన్ మృతి ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్, గతంలో నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 17న ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి దినాజ్‌పూర్ జైలులో 'డివిజన్ ప్రిజనర్'గా ఉంచారు. జైలుకు తరలించక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉన్నారని, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని జైలు సూపరింటెండెంట్ ఫర్హాద్ సర్కార్ పేర్కొన్నారు. 1940 ఏప్రిల్ 30న ఠాకూర్ గావ్ జిల్లాలో జన్మించిన రమేష్ చంద్ర సేన్, అవామీ లీగ్ పార్టీలో అనుభవజ్ఞుడైన నేతగా పేరుపొందారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో ఉపఎన్నిక ద్వారా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 2008, 2014, 2018, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, పార్టీ సలహాదారుగా కూడా వ్యవహరించారు.
0 Comments