సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ల స్థాయి వారు ఇకపై ప్రమోషన్లు పొందాలంటే కేవలం పని చేస్తే సరిపోదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను కూడా వాడాల్సిందేనని యాక్సెంచర్ స్పష్టం చేసింది. "AI నేర్చుకోండి లేదా కంపెనీ వదిలి వెళ్ళండి." అని సీఈఓ జూలీ స్వీట్ ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలోనే హెచ్ఆర్ విభాగం కొత్త రూల్స్‌ను అమలులోకి తెచ్చింది. సాధారణంగా ఏ కంపెనీ అయినా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా లేదా అని చూస్తుంది. కానీ యాక్సెంచర్ ఒక అడుగు ముందుకేసి, సీనియర్ ఉద్యోగులు వారానికి ఎన్నిసార్లు కంపెనీ అందించిన AI టూల్స్‌లోకి లాగిన్ అవుతున్నారు? ఎంత సమయం గడుపుతున్నారు? అనే వివరాలను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. నాయకత్వ బాధ్యతలు చేపట్టాలనుకునే వారు ఖచ్చితంగా AI టూల్స్‌ను తమ దైనందిన పనిలో భాగంగా చేసుకోవాలని, దీనిని "రెగ్యులర్ అడాప్షన్" కింద పరిగణిస్తామని ఇంటర్నల్ ఈమెయిల్స్‌లో వెల్లడించింది. యాక్సెంచర్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై సీనియర్ స్థాయి ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం ఉన్న తమను ఇలా చిన్నపిల్లల్లా ట్రాక్ చేయడం ఏంటని కొందరు మండిపడుతున్నారు. అంతేకాదు, కంపెనీ ఇస్తున్న కొన్ని AI టూల్స్ సరిగ్గా పనిచేయడం లేదని, అవి కేవలం "బ్రోకెన్ స్లాప్ జనరేటర్లు" అంటే నాణ్యత లేని సమాచారాన్ని ఇచ్చే యంత్రాలు అని విమర్శిస్తున్నారు. ఒక సీనియర్ ఉద్యోగి అయితే, "ఈ రూల్స్ ఇలాగే ఉంటే నేను వెంటనే రాజీనామా చేస్తాను" అని కూడా వ్యాఖ్యానించినట్లు సమాచారం. యాక్సెంచర్ ఈ మార్పుల కోసం భారీగానే ఖర్చు చేస్తోంది. ఏటా సుమారు 1 బిలియన్ డాలర్లను ఉద్యోగుల శిక్షణ కోసం కేటాయిస్తోంది. ఇప్పటికే 5.5 లక్షల మందికి AI లో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసింది. ఆంథ్రోపిక్ వంటి అగ్రగామి AI సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, క్లాడ్ వంటి అత్యాధునిక టూల్స్‌ను వినియోగంలోకి తెస్తోంది. సంస్థలోని 30,000 మందికి పైగా డెవలపర్లకు ఆంథ్రోపిక్ సహకారంతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. గత ఏడాది కాలంలో యాక్సెంచర్ షేర్ ధర దాదాపు 42% పడిపోయింది. మార్కెట్ ఒత్తిడి తట్టుకోవాలన్నా, కస్టమర్లకు కొత్త టెక్నాలజీతో సేవలు అందించాలన్నా AI ఒక్కటే మార్గమని జూలీ స్వీట్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఉద్యోగులను "రీఇన్వెంటర్స్"గా మారుస్తామని, పాత పద్ధతుల్లోనే పని చేస్తామంటే కుదరదని ఆమె స్పష్టం చేశారు. ఐరోపాలోని కొన్ని దేశాలు , అమెరికా ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పనిచేసే వారికి ప్రస్తుతం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ, మిగిలిన అందరికీ AI వాడకం ఇక తప్పనిసరి.
0 Comments