గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ) కంపెనీ లిమిటెడ్ సారథ్య బాధ్యతలను కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్ చేపట్టారు. ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ గుజరాత్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూన్ నుంచి గిఫ్ట్ సిటీ బోర్డు ఛైర్మన్‌గా (నాన్-ఎగ్జిక్యూటివ్) సేవలు అందించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ హస్ముఖ్ అధియా స్థానంలో ఉదయ్ కోటక్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ శాఖ ఈ మేరకు గురువారం ఒక తీర్మానాన్ని విడుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని, ఆయన పాత్రకు సంబంధించిన ఇతర నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుందని డిప్యూటీ సెక్రటరీ అంకితా షా సంతకం చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గుజరాత్‌లోని 886 ఎకరాల్లో విస్తరించి ఉన్న గిఫ్ట్ సిటీ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్ సిటీ. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్థిక, సాంకేతిక హబ్. వ్యాపారాలకు సులభతర వాతావరణాన్ని కల్పిస్తూ సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులిస్తారు. ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సుస్థిరత, అత్యాధునిక సాంకేతికతకు కీలకంగా మారుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post