హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో నగర పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతోనే రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు దుస్థితి పట్టించారని మండిపడ్డారు. ఉన్న నగరాన్ని గాలికి వదిలేసి, తన బినామీ భూములకు విలువ పెంచుకునేందుకే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేర్లతో కొత్త నాటకాలకు తెరతీశారని ఆరోపించారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా లాంటి కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం వల్లే పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం కేంద్రంగా ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులు, అనుచరులకు మేలు చేసేందుకు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా కూల్చివేతల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు, పారిశ్రామిక భూముల కుంభకోణం, టీడీఆర్ స్కామ్, ఫోర్త్ సిటీ పేరుతో భారీగా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని, తెలంగాణ ఆర్థిక ఇంజిన్ అయిన హైదరాబాద్ ప్రగతి తిరోగమనంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి మెట్రో నగరంగా తీర్చిదిద్దామని ఆయన గుర్తుచేశారు. ఆనాడు కరెంట్ కోతలు లేకుండా, అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించామని, అందుకే ప్రజలు వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీకి మేయర్ పీఠాన్ని కట్టబెట్టారని కేటీఆర్ స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మళ్లీ కరెంట్ కోతలు, దోమల బెడద, మంచినీటి కష్టాలు నగరంలో దర్శనమిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పక్షపాత వైఖరిని, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రస్థాయిలో ఎండగట్టాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కేవలం తన స్వప్రయోజనాల కోసం ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతున్నారు తప్ప, అసలైన హైదరాబాద్ అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నగరంలో కనీసం దోమల నివారణ చర్యలు కూడా చేపట్టలేని అత్యంత దుర్మార్గమైన పరిపాలన ప్రస్తుతం కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. మహా నగరాన్ని పలు కార్పొరేషన్లుగా విభజిస్తున్న నేపథ్యంలో తాజా భేటీలో పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ కార్యక్రమాలను, నాయకులను సమన్వయం చేసేందుకు ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బాధ్యతలను ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లకు అప్పగించారు. కొత్తగా ఏర్పడనున్న మల్కాజిగిరి కార్పొరేషన్ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యుడిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కేటీఆర్ నియమించారు. ఈ నేతలంతా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేలా కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
బినామీ భూముల విలువ పెంచుకునేందుకు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కొత్త నాటకాలకు తెరతీశారు !
السبت، 28 فبراير 2026
BRS Working President KTR CM has opened new dramas with the names of Future City Fourth City to increase the value of benami lands hyderabad telangana
ليست هناك تعليقات:
إرسال تعليق