కేంద్ర బడ్జెట్‌లో ఈ సారి కూడా రాష్ట్రానికి మొండి చెయ్యే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రయోజనాలకు బడ్జెట్‌లో అనాపైస మందం విలువ లేదని, ఇది ఆంధ్రప్రదేశ్‌ను దగా చేసిన బడ్జెట్ అని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రజలను ఊరించి ఉసూరు మనిపించిన బడ్జెట్ అని ఫైర్ అయ్యారు. అమరావతికి మళ్ళీ అప్పులే తప్ప ఆపన్నహస్తం అందించలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఊతమివ్వలేదని, రాయలసీమకు మోసమే తప్ప చిల్లిగవ్వ దక్కలేదన్నారు. జీవనాడి పోలవరానికి జీవం పోయలేదని, విభజన హామీల్లో ఒక్క దానికి పట్టింపు లేదన్నారు. ప్రత్యేక హోదాపై ఊసేలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనికరం కలగలేదు. కడప స్టీల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మెట్రో రైలు ప్రస్తావన లేదు. ఇండస్ట్రియల్ కారిడార్ల సంగతి తేల్చలేదు. పట్టుమని 10 పైసల మందం కూడా బడ్జెట్‌తో ప్రయోజనం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీని తలదన్నే రాజధాని కడతామని అప్పులు అంటగట్టడం దుర్మార్గమన్నారు. లక్ష కోట్లు ఖర్చయ్యే అమరావతికి ఏడీబీ, జపాన్ బ్యాంకుల నుంచి రూ.15 వందల కోట్లు అప్పులిప్పిస్తే రాజధాని పూర్తవుతుందా? అని ప్రశ్నించారు. గతేడాది అప్పుల కింద ఇస్తామని చెప్పిన రూ.15 వేల కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా ? అని నిలదీశారు. గ్యారెంటీ కింద అప్పులు అంటే ఎవరికి గ్యారెంటీ ? విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణం కేంద్రానిదే బాధ్యత అని తెలియదా? అప్పులు ఇస్తామని చెప్తే ఆంధ్రుల ఆత్మగౌరవం ఎప్పుడు పూర్తవుతుంది?, ఇదేనా బీజేపీ కి రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పోలవరం ప్రాజెకి మళ్ళీ తీరని అన్యాయం చేశారని అన్నారు. ఎత్తు 45.72 మీటర్లకు పెంచాలని కోరినా బడ్జెట్ లో మళ్ళీ పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు. కేవలం 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఇక ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే అని చెప్పకనే చెప్పారని వెల్లడించారు. గత బడ్జెట్‌లో ప్రాజెక్ట్ పూర్తికి ఇస్తామని చెప్పిన రూ.12 వేల కోట్లలో ఇచ్చింది రూ.5 వేల కోట్లే అని తెలిపారు. ఈ ఏడాది రూ.3 వేల కోట్లు మాత్రమే ఇస్తే 2027 నాటికి ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుంది? అని ప్రశ్నించారు. మిగిలిన నిధుల సంగతి ఏంటి ? రూ. 20 వేల కోట్ల ఆర్&ఆర్ ప్యాకేజీ మిగులు కోసం పోలవరానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటు అని విమర్శలు గుప్పించారు. కూటమిలో పెద్దన్నగా చెప్పుకునే చంద్రబాబు నోరు మెదపక పోవడం ఆయన పాలన తీరుకి నిదర్శనం అని అన్నారు.
إرسال تعليق