భారత్ లో హెచ్1బీ వీసాల కోసం చేస్తున్న ఇంటర్వ్యూలపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఇంటర్వ్యూల కోసం భారతీయులు మరో ఏడాది పాటు ఎదురుచూడాల్సిన పరిస్ధితి ఎదురు కాబోతోంది. గతేడాది డిసెంబర్ లో హెచ్1బీ వీసా విధానాల్లో ట్రంప్ సర్కార్ మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో పాటు దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లపై తనిఖీలు పెంచింది. దీంతో భారత్ లోని అమెరికా ఎంబసీల్లో జరగాల్సిన హెచ్1బీ వీసా ఇంటర్వూలు తాత్కాలికంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో హెచ్1బీ కొత్త విధానం ప్రకారం ఇంటర్వ్యూలు జరుగుతాయని దరఖాస్తుదారులు ఎన్నోఆశలు పెట్టుకున్నారు. కానీ వారికి అమెరికా తాజా నిర్ణయంతో చుక్కెదురవుతోంది. హెచ్1బీ వీసా విధానంలో చేసిన తాజా మార్పులకు తోడు సోషల్ మీడియా వెట్టింగ్ ల కారణంగా గతేడాది దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు ఇంకా పూర్తి కాలేదు. ఇవి పూర్తయితే తప్ప కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి స్లాట్లు కేటాయించే పరిస్ధితి లేదు. దీంతో అనివార్యంగా భారత్ లో హెచ్1బీ ఇంటర్వ్యూల్ని వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలకు వాయిదా వేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ లో పెండింగ్ లో ఉన్న వీసా ఇంటర్యూలు ముగిసిన తర్వాత మాత్రమే కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు ఉండవు. ప్రస్తుతం భారత్ లోని ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా సెంటర్లలో హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ స్లాట్లు లేకపోవడంతో ఈ ప్రక్రియను ఏకంగా 18 నెలలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో ఉన్న వారు ఎట్టి పరిస్ధితుల్లోనూ భారత్ కు వెళ్లొద్దని వారి కంపెనీలు కోరుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిపుణులు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ కు వచ్చిన వారి స్టాపింగ్ ఇంటర్వ్యూలు రద్దయిన విషయం గుర్తుచేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post