తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసు : విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి


తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి ఇవాళ తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. ఈ మేరకు ఆయనను అధికారులు కల్తీ నెయ్యి కేసులో ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కాగా, గత ప్రభుత్వం హయాంలో భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ సంస్థ టీటీడీకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా సిట్ నిర్ధారించింది. అందులో 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్‌ కెర్న్‌ ఆయిల్, పామ్‌ స్టెరిన్‌ తదితర రసాయనాలు వినియోగించారని పేర్కొంది. గుజరాత్‌ రాష్ట్రం ఆనంద్‌లోని ఎన్‌డీడీబీ కాఫ్‌ నెయ్యిని మరోసారి పరీక్షించి ఇదే ఏడాది మార్చి 27న కల్తీని ధ్రువీకరించిందని సిట్‌ వెల్లడించింది. మొత్తం కల్తీ నెయ్యిలో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డెయిరీ ద్వారా భోలేబాబా కంపెనీ తిరుమలకు సరఫరా చేసింది.

Post a Comment

0 Comments