Ad Code

తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని బీబీసీని డిమాండ్ చేసిన ట్రంప్


బీబీసీ తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. 2021లో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుగా చూపించడంతో బీబీసీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సంస్థ ఉన్నతాధికారులు ఇప్పటికే రాజీనామా చేశారు. ట్రంప్ న్యాయవాది అలెజాండ్రో బ్రిటో, బీబీసీకి రాసిన లేఖలో.. సవరించిన డాక్యుమెంటరీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరారు. తప్పుడు ప్రచారంతో ట్రంప్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని అన్నారు. ఇందుకోసం శుక్రవారం వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ట్రంప్ న్యాయ బృందం పంపిన లేఖను పరిశీలిస్తున్నట్లు బీబీసీ ధృవీకరించింది. క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుగా చూపించినందుకు బీబీసీ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పింది. జనవరి 6, 2021న వాషింగ్టన్‌లో జరిగిన ఈ దాడికి ముందు ట్రంప్ గంట పాటు ప్రసంగించారు. బీబీసీ పనోరమ డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగంలోని ఒక భాగాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేశారు. అందులో "క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతోపాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదాం. ఘోరంగా పోరాడదాం" అన్నట్లుగా చూపించారు. అయితే తొలగించిన భాగంలో శాంతియుతంగా ఆందోళనకారులు పోరాడాలని ట్రంప్ పిలుపునిచ్చినట్లు ఉంది. ఈ విషయంపై తీవ్ర విమర్శలు రావడంతో పాటు, ట్రంప్ రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఫలితంగా, ప్రభుత్వ నిధులతో నడిచే బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu