అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్ళడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలవగా ఒకరు సురక్షితంగా బయటపడిన విషాద సంఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామం వద్ద చోటుచేసుకుంది. మృతులు హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన వంశీ (23), దిగ్నేశ్ (21), హర్ష (21), బాలు (19), వినయ్ (21)గా గుర్తించగా, ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని మణికంఠ (21)గా గుర్తించారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగింది. చెరువులో కారు మునిగిపోవడంతో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్లలోపు వారే. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భూదాన్ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments