విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని ప్రసంగిస్తూ ''తెలుగు భాషను కాపాడుకుందాం. ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు'' అన్నారు. ''తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మహోన్నత వ్యక్తి, తుది శ్వాస వరకూ తెలుగు భాష, సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన యోధుడు రామోజీరావు సభా వేదిక నుంచి మిమ్మల్నందర్నీ చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతి, భాషను మరిచిపోకూడదని, తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలు నిత్యం వెలుగొందాలని కోరుకునే వ్యక్తిని నేను. తెలుగు భాషను దేశంలో వంద మిలియన్లకు పైగా మాట్లాడతారు. తెలుగుభాష పలుకుబడి వినసొంపైనది. అది సంగీతంలా ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు. ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగును.. వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష, సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు''. ''తెలుగు భాషా, సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారమవుతాం. జాతి మనుగడకు, వికాసానికి ధైర్యం కావాలి. భాష లేకపోతే.. ఎన్ని ఉన్నా చరిత్ర లేని అనాథలం, అక్షరం లేని అభాగ్యులం. మన సంస్కృతి, భాష చిరకాలం నిలిచి ఉండేలా.. శ్రీశ్రీ, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సినారెలాంటి గొప్ప కవులు, రచయితలు, భానుమతి, సూర్యకాంతం, జమున, సావిత్రి, గుమ్మడి, జగ్గయ్య, అక్కినేని, ఎన్టీఆర్, రేలంగి, ఎస్వీఆర్, ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇలా ఎందరెందరో దిగ్గజాల ఘనమైన వారసత్వం మనది. ఈ వారసత్వం మరవకండి. మీరు గుర్తుంచుకోండి.. మీ పిల్లలకు గుర్తు చేయండి. 'భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం. ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితోపాటు.. భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలి'' అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.
0 Comments