ఒకే దేశం - ఒకే ఎన్నికను అమలు చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, ఈ చర్యను ఖండిస్తున్నట్లు ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ పేర్కొన్నారు. తన పార్టీ జిల్లా ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులతో ఆదివారం తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీకేని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజలకు చేరువయ్యే అంశాలపై ప్రధానంగా చర్చించి 26 తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా డీఎంకే, భాజపా పాలనపై మండిపడిన విజయ్ తమిళనాడులో శాంతిభద్రతల అంశంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులో కులగణన చేపట్టాలని, పరందూర్ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిర్దేశిత గడువు నిర్దేశించుకొని క్రమంగా మద్యం దుకాణాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీరుపైనా విమర్శలు చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ రివ్యూలో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లు- 2024ను ఫెడరలిజంపై దాడిగా పేర్కొన్నారు. ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా నిలిచిన విజయ్, విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి మార్చాలని కోరారు. తమిళనాడు ప్రజల సామరస్యత, ఐక్యత కోసం పనిచేసే తమ పార్టీ సిద్ధాంతం లౌకిక వాదం, సామాజిక న్యాయమేనన్నారు.
0 Comments