రైల్వే టికెట్ రిజర్వేషన్‌, క్రెడిట్‌ కార్డ్‌, యూపీఐ నిబంధనల్లో మార్పులు!

రైల్వే టికెట్ల బుకింగ్‌, యూపీఐ నగదు బదిలీ పరిమితులు, క్రెడిట్‌ కార్డుల్లో నవంబర్‌ 1 నుంచి కొన్ని మార్పులు వచ్చాయి. అక్టోబర్ 31 వరకు రైలు టికెట్‌ లను 120 రోజుల గడువుతో బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉండేది. అయితే నవంబర్‌ 1 నుంచి 60 రోజుల వరకు మాత్రమే ప్రస్తుతం టికెట్లను బుకింగ్‌ చేసుకొనే అవకాశం ఉంది. 120 రోజుల ముందు రైల్వే టికెట్‌ లను బుకింగ్ చేసుకుంటున్న వారిలో 21 శాతం మంది టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారని ఐఆర్సీటీసీ తెలిపింది. దీంతోపాటు మరో ఐదు శాతం వరకు టికెట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రయాణాలు చేయడం లేదని పేర్కొంది. దీంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ తరహా సమస్యలకు పరిష్కారం చూపేందుకు రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ ముందస్తు బుకింగ్‌ గడువును 60 రోజులకు కుదించినట్లు తెలిపింది. పరిమితికి మించి లగేజీ తీసుకువస్తే జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు ఉచిత లగేజీ విషయంలోనూ అనుమతించిన దాని కంటే ఎక్కువ తీసుకొస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు యూపీఐ లావాదేవీలపైనా కొత్త రూల్‌ అమల్లోకి వచ్చింది. యూపీఐ లైట్‌ నుంచి రూ.1000 వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు. గతంలో రూ.500 వరకు పంపేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ఎస్బీఐ క్రెడిట్‌ కార్డు ఫైనాన్స్‌ ఛార్జీలను పెంచింది. 3.5 శాతంగా ఉన్న దాన్ని నవంబర్‌ 1 నుంచి 3.75 శాతానికి పెంచింది. దీంతోపాటు ఒక బిల్లింగ్ సైకిల్‌లో యుటిలిటీ పేమెంట్‌ లు రూ.50 వేలు దాటితే 1 శాతం సర్‌ఛార్జీ వసూలు చేయనుంది.

Post a Comment

0 Comments