మెయిన్‌ రైల్వే లైన్‌ పక్కన భారీ భవనం నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారు?


వైకాపా నేత అంబటి మురళీకి చెందిన గ్రీన్‌ గ్రేస్‌ అపార్టుమెంట్‌ నిర్మాణంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌తో పాటు అన్ని శాఖల అధికారులకూ ఈ పాపంలో భాగముందని విమర్శించారు. చివరకు రైల్వే అధికారులు కూడా నిబంధనలు పట్టించుకోలేదన్నారు. రైల్వే ట్రాక్‌ పక్కన ఎవరైనా గుడిసెలు వేస్తే వెంటనే తొలగిస్తారని, ప్రధాన లైన్‌ పక్కనే భారీ భవనం నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ''అధికారులపై చర్యలకు మున్సిపల్‌ కమిషనర్‌ లేఖ రాస్తే సరిపోదు. భవన నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పీసీబీ అధికారులు నోటీసులతో సరిపెడితే ఉపయోగం లేదు. కూటమి ప్రభుత్వంపై వైకాపా ఆరోపణలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంది. అధికారం పోయిందనే బాధతో జగన్‌, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. జగన్‌ దిల్లీకి వెళ్తే మోదీతో ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. సీఎం చంద్రబాబు మాత్రం దిల్లీ వెళ్తే రాష్ట్రానికి నిధులు కావాలని అడుగుతున్నారు. కేంద్రం సాయం లేకుండా ఏపీ గట్టెక్కే పరిస్థితి లేదు. మా ప్రభుత్వం ఏపీని అభివృద్ధి వైపు నడిపించడానికి కొత్త పాలసీలు తెస్తోంది'' అని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. 

Post a Comment

0 Comments