మహిళల భద్రత కోసం 112 ఇండియా యాప్‌ !


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ యాప్‌ 112 మహిళల అత్యవసర సమయాల్లో సాయం అందేలా చేస్తుంది. అర్ధరాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నా లేదా ఒంటరి ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ యాప్‌ ద్వారా సాయం కోరవచ్చు. సింగిల్‌ బటన్‌తో మీ లోకేషన్‌ను మెసెజ్ రూపంలో పంపవచ్చు. దాంతోపాటు 112 నంబర్‌కు ఎమర్జెన్సీ కాల్‌ చేయవచ్చు. ఫలితంగా అత్యవసరంగా మీకు కావాల్సిన సాయం అందుతుంది. ఈ యాప్‌ ద్వారా వాయిస్‌ కాల్‌, SOS బటన్‌, SMS, ప్యానిక్‌ బటన్‌ ద్వారా అత్యవసర సాయం కోరవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్‌, iOS యాప్‌లలో అందుబాటులో ఉంది.112 యాప్‌ ప్రత్యేకంగా మహిళల కోసం పనిచేస్తుంది. ఆటోమేటిక్‌గా మీ లోకేషన్‌ను గుర్తించి, మీకు సమీపంలో ఉన్న సహాయ బృందాలను అప్రమత్తం చేస్తుంది. ఈ యాప్‌ ద్వారా పోలీస్‌, అగ్నిమాపక శాఖ, వైద్య శాఖ, విపత్తుల నిర్వహణ బృందాల నుంచి సాయం అందుతుంది. రాష్ట్ర రాజధానుల్లో ఉన్న పర్యవేక్షణ కేంద్రాల ద్వారా ఈ సేవలను పర్యవేక్షించవచ్చు, సేవలను మరింత మెరుగుపరచవచ్చు. దీంతోపాటు ఈ యాప్‌ ద్వారా అత్యవసర బృందాల వాహనాలను కూడా ట్రాక్ చేయవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌, ఆపిల్ స్టోర్‌ ద్వారా "112 india" యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 112 యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, ఓపెన్‌ చేసి హోం స్క్రీన్‌లోకి వెళ్లాలి. అనంతరం మీ వివరాలను నమోదు చేసుకోవాలి. మీ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసి, ఆ నంబర్‌కు వచ్చిన OTP ని కూడా నమోదు చేయాలి. అనంతరం మీ లొకేషన్‌ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఫలితంగా అత్యవసర బృందాలు మీ లోకేషన్‌కు చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది. అత్యవసర సమయాల్లో యాప్‌లోని అత్యవసర బటన్‌ను ట్యాప్‌ చేసి సాయం కోరవచ్చు. ఈ యాప్‌.. పోలీస్‌, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌ వంటి విభాగాలతో మిమ్మల్ని కనెక్ట్‌ చేస్తుంది. దీంతోపాటు మీ లైవ్‌ లొకేషన్‌ను మీ కుటుంబ సభ్యులు, బంధువులకు షేర్‌ చేస్తుంది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల నుంచి బయటపడేందుకు వీలుంటుంది.

Post a Comment

0 Comments