హిజాబ్‌ నిషేధం ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే !


కాలేజీ క్యాంపస్‌లో హిజాబ్‌, బుర్కా, నిఖాబ్‌ ధరించకూడదంటూ చెంబూరు కళాశాల జారీ చేసిన సర్క్యులర్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ముంబయిలోని ఎన్‌జి ఆచార్య, డికె మరాఠే కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కళాశాల విధించిన షరతులపై జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, సంజరుకుమార్‌ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాలేజీ యాజమాన్యం వాదనలపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థుల పేర్లు మతాన్ని బహిర్గతం చేయడం లేదా? నెంబర్స్‌ ద్వారా వారిని గుర్తించమని అడుగుతారా? అంటూ జస్టిస్‌ సంజరుకుమార్‌ ప్రశ్నించారు. కాలేజీ తరపు సీనియర్‌ న్యాయవాది మాధవి దివాన్‌ వాదనలు వినిపిస్తూ ఇది ప్రైవేట్‌ సంస్థ అని చెప్పగా, కాలేజీ ఎప్పటి నుంచి పని చేస్తుందని జస్టిస్‌ సంజరుకుమార్‌ ప్రశ్నించారు. 2008 నుంచి కళాశాల ఉనికిలో ఉందని చెప్పగా, ఇన్నాళ్లు మీరు ఎందుకు సూచనలు చేయలేదు? మతాన్ని అకస్మాత్తుగా గుర్తించారా? ఏళ్ల తర్వాత ఇలాంటి సూచనలు చేయడం దురదృష్టకరమని, తిలకం ధరించిన వారిని సైతం అనుమతించబోమని చెబుతారా? అంటూ జస్టిస్‌ ఖన్నా న్యాయవాదిని ప్రశ్నించారు. కాగా, 441 మంది ముస్లిం విద్యార్థులు కళాశాలకు సంతోషంగా హాజరవుతున్నారని.. కొందరు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. అయితే నచ్చిన దుస్తులు ధరించేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలని న్యాయస్థానం తెలిపింది. ఈ విషయంలో స్పందన చెప్పాలని ముంబయి ఎడ్యుకేషన్‌ సొసైటీని సుప్రీంకోర్టు కోరింది. ఈమేరకు కళాశాలకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను నవంబర్‌కి వాయిదా వేసింది. స్టే ఆర్డర్‌ను ఎవరూ దుర్వినియోగం చేయొద్దని బెంచ్‌ స్పష్టం చేసింది. ఆర్డర్‌లో సవరణలు కోరేందుకు కళాశాల అధికారులకు అనుమతి ఇచ్చింది.

Post a Comment

0 Comments