ఆంధ్రప్రదేశ్ లోని అరకు లోక్ సభ సీటు నుంచి వైసీపీ అభ్యర్దిగా గుమ్మ తనూజా రాణి తొలిసారి బరిలోకి దిగారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆమెకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగారు. ఎన్నికల్లో తనూజా రాణి 50580 ఓట్ల తేడాతో కొత్తపల్లి గీతను ఓడించారు. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తనూజా రాణి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తనూజా రాణితో పాటు ఎన్నికల అధికారులకూ నోటీసులు జారీ చేసింది. వైసీపీ అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనూజారాణి ఎన్నికల అఫిడవిట్ లో వాస్తవాలు చెప్పలేదని, దీనిపై తాను రిటర్నింగ్ అధికారిని ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపిస్తూ కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికల అధికారులకూ, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు ఇతర అభ్యర్ధులకు సైతం హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఆలోపుగా సమాధానం ఇవ్వాలని వారిని హైకోర్టు ఆదేశించింది.
0 Comments