Ad Code

హిండెన్‌బర్గ్‌-2 దెబ్బకు కుప్పకూలిన అదానీ గ్రూప్‌ షేర్లు !


దేశీయ స్టాక్‌ మార్కెట్లలో అదానీ గ్రూప్‌ షేర్లు మరోమారు మూకుమ్మడిగా కుప్పకూలాయి. శనివారం మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌ దంపతులపై అమెరికా షార్ట్‌-సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో సోమవారం ఈక్విటీ మార్కెట్లు షేక్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆరంభంలో భారీ నష్టాల దిశగా సూచీలు పయనించాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 సంస్థల షేర్లు పెద్ద ఎత్తున క్షీణించాయి. ఫలితంగా అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ ఒక్కసారిగా దాదాపు రూ.1.13 లక్షల కోట్లు (13.4 బిలియన్‌ డాలర్లు) హరించుకుపోయింది. అయితే సమయం గడుస్తున్నకొద్దీ అటు సూచీలు, ఇటు షేర్లు తిరిగి కోలుకున్నాయి. అయినప్పటికీ మెజారిటీ షేర్లు నష్టాలకే పరిమితం కావడం గమనార్హం.అంబుజా సిమెంట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ స్వల్పంగా లాభపడ్డాయి. మిగతా 8 షేర్లు 4.14 శాతం నుంచి 0.65 శాతం మేర దిగజారాయి. దీంతో ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు రూ.22,064 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక మొత్తంగా చూసినైట్టెతే బీఎస్‌ఈలోని 11 అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.17 లక్షల కోట్లపైనే. కాగా, సెబీ చీఫ్‌ మాధవి పురి, ఆమె భర్త ధవల్‌ బచ్‌.. బెర్ముడా, మారిషస్‌ల్లోని ఫండ్లలో పెట్టుబడులు పెట్టారని, అవి అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ కనుసన్నల్లో నడుస్తున్నవంటూ హిండెన్‌బర్గ్‌ ఓ 'విజిల్‌బ్లోయర్‌’ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.



Post a Comment

0 Comments

Close Menu