ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ !


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారు. విభజన హామీల అమలుతో పాటు పోలవరం నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరుపై చర్చించారు. అలాగే, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు, పారిశ్రామిక రంగాలకు రాయితీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయి వివిధ అంశాలపై మాట్లాడారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మెహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్ నీరభ్ కుమార్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం, ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉదయం 10:45 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ అవుతారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు జపాన్ రాయబారితో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.


Post a Comment

0 Comments