ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉంది. దానిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నాయకులు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. ఆ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరాగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సెన్ రూ. 1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం మొత్తం అందించడంతోనే ఆ పనులు ముందుకు కదిలాయి. గత నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు రాగా…కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా ఈ లంచం బాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్ భాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా.. లంచం తీసుకున్న మాట నిజమే అని తెలిసింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ లక్ష డిమాండ్ గత నెలలో శాంతిపురానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీని పై విచారణ జరిపి.. అది కూడా నిజమే అని అధికారులు నిర్థారించారు. ఈ అంశాల పై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఏడీని ఆదేశించారు. డిప్యూటీ సర్వేయర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
0 Comments