పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దంపతులు నిర్దోషులుగా తీర్పు !


నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీకి ఊరట లభించింది. ఇస్లామాబాద్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్ కోర్టు వారిపై ఉన్న అభియోగాలను తోసిపుచ్చుతూ నిర్దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. అలాగే ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టివేసింది. బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్‌ ఫరీద్‌ పెట్టిన కేసుపై గతంలో ట్రయల్‌ కోర్టు విచారణ జరిపింది. నిబంధనలను తన మాజీ భార్య బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్‌ ఆమెపై కేసు పెట్టారు. అంతేగాక, పెళ్లికి ముందునుంచే బుష్రా, ఇమ్రాన్‌ల మధ్య బంధం కొనసాగిందని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇమ్రాన్‌ దంపతులకు ఏడేళ్ల శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. బుష్రా బీబీ 2017 నవంబరులో ఫరీద్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్‌ను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌పై ఉన్న కొన్ని కేసుల్లో ఆయన దోషిగా తేలగా, మరికొన్నింటిలో విచారణ జరుగుతోంది. దాంతో ఆయన 'పెళ్లి' కేసులో నిర్దోషిగా తేలినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

Post a Comment

0 Comments