గూగుల్ పే ద్వాారా చేసే మొబైల్ రీఛార్జ్‌లపై ఆ సంస్థ కన్వీనియన్స్ ఫీజును విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ సామాజిక మాద్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనిని గూగుల్ పే సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే ఫోన్ పే, పేటీఎం లాంటి సంస్థలు యూపీఐ ద్వారా చేసే మొబైల్ రీఛార్జ్‌లకు రుసుమును వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో గూగుల్ పే కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ముకుల్ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్లో సంబంధిత పోస్ట్‌ను షేర్ చేశారు. ఆయన గూగుల్ పే యాప్ ద్వారా రూ. 749 రూపాయలు జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకున్నారు. దీనిపై రూ.3 కన్వీనియన్స్ ఫీజు విధించినట్లుగా మెసేజ్ వచ్చింది. అయితే రూ. 100లోపు గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఈ నిబంధన వర్తించదని ముకుల్ శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ప్రకారం రూ. 100 నుంచి రూ.200 వరకు కన్వీనియన్స్ ఛార్జ్ రూ.2లు, రూ. 200 నుంచి రూ.300 వరకు చేసే రీఛార్జ్‌లపై రూ.3 లు ఛార్జ్ చేస్తుంది. రూ.300పైన చేసిన రీఛార్జులకు కూడా రూ. 3 ఛార్జీ ఉందని ముకుల్ శర్మ తెలిపారు. కన్వీనియన్స్ ఫీజుకు సంబంధించి నవంబర్ 10న అప్డేట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గూగుల్ పే నిబంధనల ప్రకారం ఏదైనా కొనుగోలు పూర్తి చేయడానికి ముందు సంబంధిత ఖర్చుల గురించి వినియోగదారులకు తెలియజేస్తామని పేర్కొంది. మరోవైపు గూగుల్ తన సేవా నిబంధనలను భారత్ వినియోగదారులకు ఇటీవలే అప్డేట్ చేసింది. అయితే ఈ కన్వీనియన్స్ ఫీజు విధింపు నవంబర్ 10న అప్డేట్ చేసిన నిబంధనల్లో భాగమా అనేది అస్పష్టంగా ఉంది. లావాదేవీనీ పూర్తి చేయడానికి ముందు వర్తించే ఛార్జ్‌ల గురించి వినియోగదారులకు తెలుసుకునేవిధంగా ఈ నిబంధనలు ఉన్నాయి.
0 Comments