'గురజాడ నాటక శిక్షణ' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నాటక శిక్షణా శిబిరాలు : మంత్రి కందుల దుర్గేష్!
Monday, October 5, 2026
Andhra Pradesh Minister Kandula Durgesh Nandi Film Awards presentation ceremony in December Special theatre training camps across the state under the banner 'Gurajada Nataka Sikshana'
ఆంధ్రప్రదేశ్‌లో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కళాకారుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 'గురజాడ నాటక శిక్షణ' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నాటక శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 1933 జారీ చేసిందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ కార్యక్రమం కోసం రూ.20 లక్షల వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. అర్హత కలిగిన నాటక సమాజాలు, నాటక పరిషత్తులు, గుర్తింపు పొందిన నాటక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో వివిధ విభాగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా బాలల నాటక శిక్షణ, యువజన నాటక శిక్షణ, నాటక రచయితలు, దర్శకులకు శిక్షణతో పాటు మేకప్, రంగస్థల సాంకేతిక విభాగాల్లోనూ నిపుణులతో శిక్షణ అందించనున్నారు. శిక్షణకు హాజరయ్యే కళాకారులకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటు, నాటక ప్రదర్శనల్లో నాణ్యతను పెంచేలా కార్యక్రమాలను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఫ్యాకల్టీ గౌరవ వేతనాలు, శిక్షణా శిబిరాలకు సంబంధించిన ఇతర వ్యయాల వివరాలను జీవోలో స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) వివిధ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఎఫ్‌డీసీ బోర్డు ఏర్పాటైన అనంతరం నంది ఫిల్మ్, టీవీ అవార్డులు, నంది నాటకోత్సవాలు, కందుకూరి పురస్కారాలను ప్రకటించినట్లు గుర్తుచేశారు. డిసెంబర్‌లో అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది చలనచిత్ర పురస్కారాలు, తిరుపతి వేదికగా నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జనవరిలో నంది నాటకోత్సవాలు, కందుకూరి పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నంది నాటకోత్సవాల్లో కళాకారులు అత్యుత్తమ ప్రమాణాలతో ప్రదర్శనలు ఇచ్చేలా వారిని ముందుగానే సన్నద్ధం చేయడంలో 'గురజాడ నాటక శిక్షణ' శిబిరాలు కీలకంగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికి మహాకవి గురజాడ వెంకట అప్పారావు అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన 164వ జయంతి సందర్భంగా ఈ శిక్షణా కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టాలని ఎఫ్‌డీసీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. శిక్షణా శిబిరాల నిర్వహణకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. నాటక రంగం ద్వారా యువతలో సృజనాత్మకత, సామాజిక స్పృహ, కళా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అంతరించిపోతున్న కళారూపాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి దుర్గేష్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా సజీవ కళల ప్రాధాన్యం, రంగస్థల కళల ప్రత్యేకత ఎప్పటికీ కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు కొత్త తరం కళాకారులను తీర్చిదిద్దే దిశగా ఈ శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment