Friday, October 16, 2026

రాహుల్ గాంధీ దిగజారి మాట్లాడుతున్నారు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ లోని నాంపల్లి, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ దిగజారి మాట్లాడుతున్నారని, దేశంలో ఓటు చోరీ జరగలేదని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం, ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ గెలిస్తే జ్ఞానేశ్ కుమార్, ఈవీఎంలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్‌ను వదిలిపెట్టబోమని రాహుల్ గాంధీ అంటున్నారని, ఆయన దాదాగిరి చేస్తున్నారా? అని ప్రశ్నించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరును కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అజిత్ దోవల్ పేరు చెబితే పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని, దేశ యువత హృదయాల్లో అజిత్ దోవల్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ దేశంలో ఓట్ చోరీ జరగలేదని, చోరీకి పాల్పడేవారికి ప్రజలు ఓట్లు వేయడం లేదని అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణతో సంబంధం లేకుండానే గతంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో విజయం సాధించిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం బ్లాక్‌మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తీర్పులు అనుకూలంగా రాకపోతే న్యాయమూర్తులను తప్పుపడుతున్నారని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగి పట్ల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనుచితంగా ప్రవర్తించారని కూడా కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరుకు పొంతన లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతలను నిత్యం అరెస్టు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో మాత్రం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు, ఢిల్లీలో చేస్తున్న ప్రసంగాలకు మధ్య వ్యత్యాసం ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు కొందరు విదేశాల నుంచి వచ్చి కుట్రలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఒకరు జర్మనీ నుంచి, మరొకరు అమెరికా నుంచి వచ్చి దేశంలో కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశ అభివృద్ధిని చూసి సహించలేని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. డీప్ స్టేట్ కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. ఇందులో భాగంగా ప్రజల్లో అసంతృప్తిని పెంచడం, రాజ్యాంగబద్ధమైన సంస్థలపై అపవాదులు వేయడం జరుగుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.