Friday, October 16, 2026

దేశంలో జరుగుతున్న నిరసనల పరిస్థితిని నిఘా సంస్థలు, సంబంధిత విభాగాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి

ఢిల్లీలోని మీడియా సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ  అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ దేశ, అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై స్పందించారు. దేశంలో జరుగుతున్న నిరసనల పరిస్థితిని నిఘా సంస్థలు, సంబంధిత విభాగాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా అవి తీసుకోనివ్వాల్సిన చర్యలను తీసుకుంటున్నాయని అన్నారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు ఇరు దేశాలు సానుకూల వాతావరణంలో చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే విదేశాంగ మంత్రి, వాణిజ్య మంత్రులు కూడా దీనిపై మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, యూఏఈ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరిపారని జైస్వాల్ వెల్లడించారు. వ్యాపారం, ఇంధనం, యూఏఈలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. మాల్దీవుల అభివృద్ధి భాగస్వామ్యంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని జైస్వాల్ తెలిపారు. మాల్దీవుల ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, 2024 అక్టోబర్‌లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. మొదటి విడత రూ.3,000 కోట్ల కరెన్సీ స్వ్యాప్ రోల్‌ఓవర్‌ను అక్టోబర్ 23 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ నిర్ణయం మాల్దీవుల ఆర్థిక స్థిరత్వానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం కెనడా విదేశాంగ మంత్రి ఢిల్లీ పర్యటనకు వచ్చి విదేశాంగ మంత్రితో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారని తెలిపారు. ఈ భేటీలో ప్రధానమంత్రి కెనడా పర్యటన అంశం చర్చకు వచ్చిందని, పర్యటన తేదీలను ఖరారు చేసే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని, తగిన సమయంలో అధికారికంగా ప్రకటిస్తామని రణధీర్ జైస్వాల్ తెలిపారు.